Ravi Shastri and Shahid Afridi On ODI Cricket: టీ20 క్రికెట్ వచ్చాక.. వన్డే క్రికెట్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. ఇంతకుముందులాగా వన్డే క్రికెట్‌ను క్రీడాభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దాదాపు ఒక రోజంతా దానికే కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి, వన్డే క్రికెట్‌పై అంత ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఫార్మాట్‌ను 50 నుంచి 40 ఓవర్లకు కుదించాల్సిందిగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది ప్రతిపాదించాడు. మన టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సైతం అతని ప్రతిపాదనకు మద్దతు తెలుపుతూ.. వన్డే క్రికెట్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
‘‘వన్డే క్రికెట్ 50 ఓవర్ల పాటు సాగుతుండడం వల్లే ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారన్నారు. కాబట్టి.. ఈ ఫార్మాట్‌ను 40 ఓవర్లకు కుదించాల్సిన సమయం వచ్చేసింది. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం.. వన్డే క్రికెట్ అంతరించిపోయే ప్రమాదం ఉంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. 40 ఓవర్లకు కుదిస్తే.. వన్డే ఫార్మాట్‌కు మునపటి కంటే ఎక్కువ ఆదరణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 60 ఓవర్లుగా సాగే వన్డే ఫార్మాట్‌ను 50 ఓవర్లకు కుదించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వన్డేను 40 ఓవర్లకు కుదిస్తేనే.. వన్డే క్రికెట్ మనుగడ కొనసాగుతుందని పేర్కొన్నారు.
50 ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ వల్ల ఆటగాళ్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురవ్వడంతో పాటు అలసట చెందుతున్నారన్నారు. ఈ విషయంలో ఐసీసీ త్వరగా మేల్కోవాలని, లేకపోతే వన్డే ఫార్మాట్ చచ్చిపోతుందని రవిశాస్త్రి తెలిపారు. అయితే.. వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజ ఆల్‌రౌండర్ మాత్రం అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో నుంచి వన్డే ఫార్మాట్‌నే తొలగించాలని చెప్పడం షాక్‌కి గురి చేస్తోంది.