హిస్టరీ క్రియేట్ చేసిన అశ్విన్‌.. తొలి భారత బౌలర్‌గా..

0
372

భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ లేటెస్ట్‌గా ఓ సంచలన రికార్డ్ నమోదు చేశాడు. స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లోని తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడంతో.. అశ్విన్ ఈ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. భారత గడ్డపై ఆయన టెస్టుల్లో 25 సార్లు ఐదు వికెట్ల హాల్స్ నమోదు చేశారు.

ఇప్పుడు తాజా మ్యాచ్‌తో 26వ సారి 5 వికెట్ల హాల్ సాధించి, కుంబ్లే రికార్డ్‌ని అశ్విన్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా అశ్విన్‌కి ఇది 32వ ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం. ఇదే సమయంలో అశ్విన్ మరో సంచలన రికార్డ్‌ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా అశ్విన్‌ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు 111 వికెట్లతో అనిల్ కుంబ్లే పేరిట ఆ రికార్డ్ ఉండగా.. 113 వికెట్లతో అశ్విన్ ఆ రికార్డ్‌ని పటాపంచలు చేశాడు. భారత బౌలర్లలో ఈ ఇద్దరు మినహా మరెవ్వరు ఆస్ట్రేలియాపై 100 వికెట్లకు మించి తీయలేదు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(180), కామెరాన్ గ్రీన్(114) సెంచరీలతో చెలరేగడం వల్లే.. ఈ జట్టు ఇంత భారీ స్కోర్ చేయగలిగింది. టాడ్‌ మర్ఫీ సైతం 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ల విషయానికొస్తే.. అశ్విన్ ఆరు వికెట్లతో చెలరేగగా, మహమ్మద్ షమీ రెండు వికెట్లు, రవీంద్ర జడేజా & అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here