చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్న అత్యంత కీలకమైన ఆటగాళ్లలో రవీంద్రా జడేజా ఒకడు. అఫ్‌కోర్స్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అతడు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు కానీ, గత సీజన్లలో మాత్రం ఎన్నోసార్లు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కొన్నిసార్లు ఒంటిచేత్తోనే జట్టుని ముందుకు నడిపించిన సందర్భాలూ ఉన్నాయి. అలాంటి ప్లేయర్, ఆ జట్టుకి గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు చాలారోజుల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. కారణం.. ఈ సీజన్‌లో సరిగ్గా ప్రదర్శించకపోవడమే!
కెప్టెన్‌గానూ, ఆటగాడిగానూ ఫెయిల్ అవ్వడం.. గాయం కారణంగా దాదాపు సగం సీజన్ దూరంగా ఉండడంతో.. జడేజా చెన్నై జట్టుకి గుడ్‌బై చెప్పొచ్చన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో జడేజా తాజాగా తన ఇన్‌స్టామ్ ఖాతా నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన పోస్టులను తొలగించడంతో.. ఆ ప్రచారానికి ఆజ్యం పోసినట్టయ్యింది. వచ్చే సీజన్ నుంచి ఇతడు ఐపీఎల్‌లో సీఎస్కేకి ప్రాతినిథ్యం వహించకపోవచ్చన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. ఓ కీలకమైన ఆటగాడ్ని చెన్నై జట్టు కోల్పోయినట్టే!
ఆల్రెడీ సురేశ్ రైనాను పక్కన పెట్టినందుకు చెన్నై జట్టు బలహీన పడిందన్న అపవాదుల్ని మూటగట్టుకుంటోంది. రైనా లేకపోవడం వల్లే ఈ సీజన్‌లో చెన్నై చెత్తగా రాణించిందని దిగ్గజాలు సైతం తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఇప్పుడు జడేజా కూడా వెళ్లిపోతే.. చెన్నై జట్టు మరింత బలహీనపడటం ఖాయమని విశ్లేషకులు చెప్తున్నారు. మరి, చెన్నై జడేజాని కోల్పోతుందా? లేకపోతే రిటైన్ చేసుకుంటుందా? ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.