Rohit Sharma: ఆ మ్యాచ్ గెలవకపోవడం నిరాశకు గురి చేసింది

0
218

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ అద్భుతంగా రాణించడంతో.. ఈ మ్యాచ్ తప్పకుండా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లో సీన్ రివర్స్ అయ్యింది. బ్యాట్స్మన్లంతా చేతులు ఎత్తేయడం, ఇంగ్లండ్ బ్యాట్స్మన్లు చెలరేగడంతో.. మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చింది. ఎవ్వరూ ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు. భారత్ కైవసం చేసుకుంటున్న మ్యాచ్‌ని ఇంగ్లండ్ గెలిచేసింది. దీంతో అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. తాను నిరాశకు గురయ్యానంటూ తాజాగా రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఆ రీషెడ్యూల్ మ్యాచ్ భారత్ గెలవాల్సిందని అభిప్రాయపడ్డాడు.

‘‘ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ గెలవాల్సింది. ఆ మ్యాచ్ ఓడిపోవడం నిరాశకు గురి చేసింది. నిజానికి.. ఆ టెస్ట్ సిరీస్ భారత్ గెలవాల్సింది కానీ దురదృష్టవశాత్తూ అలా జరగలేదు. అయితే.. ఈ ఓటమి ప్రభావం ఇంగ్లండ్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌లపై అంతగా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే.. అన్నీ వేర్వేరు ఫార్మాట్లు కదా’’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సమయంలో అక్టోబర్ నుంచి జరగనున్న టీ20 ప్రపంపకప్-2022 టోర్నీపై రోహిత్ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌ ఈవెంట్‌ను దృష్టిలో పెట్టుకునే మేమంతా ముందుకు సాగుతున్నాం. ఇకపై ఆడే ప్రతీ సిరీస్ మాకు చాలా కీలకమైంది. ముఖ్యంగా.. ఇంగ్లండ్‌తో పోరు చాలా ఛాలెంజ్ వంటిది’’ అని అన్నాడు.

ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ ఐర్లాండ్ టీ20 సిరీస్‌తో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడారు కాబట్టి.. ఇంగ్లండ్‌‌తో టీ20 సిరీస్‌లో బాగా రాణిస్తారన్న ఆశాభావాన్ని రోహిత్ శర్మ వ్యక్తపరిచాడు. కాగా.. గతేడాదిలోనే జరగాల్సిన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే! ఈ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో.. 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించడంతో టెస్ట్ సిరీస్ 2-2తో సమం అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here