యువ ఆటగాడు రిషభ్ పంత్ టెస్టుల్లో బాగానే రాణిస్తున్నాడు కానీ, పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే తడబడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో దుమ్మురేపిన పంత్.. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు తనదైన పరిష్కారం తెలిపాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. పంత్‌ను టీ20ల్లో ఓపెనర్‌గా పంపితే, అతడు పరుగుల వర్షం కురిపించడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
‘‘పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పంత్‌ను ఓపెనర్‌గా పంపిస్తే.. అతడు విధ్వంసం సృష్టించడం ఖాయమని నేను భావిస్తున్నాను. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా అదరగొట్టేవాడు. టెస్టుల్లో అతడు ఆరు లేదా ఏడో స్థానంలో వచ్చి, చితక్కొట్టేవాడు. అతనిలాగే పంత్ టెస్టుల్లో రాణిస్తున్నాడు కాబట్టి, పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా దింపితే బాగుంటుందని అనుకుంటున్నా. అప్పుడతనికి వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. ఫలితంగా.. అతడి నుంచి మనం విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూడగలం’’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
మరి, ఈయన అభిప్రాయంతో ఏకీభవించి పంత్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా పంపుతారా? లేదా? అన్నది వేచి చూడాలి. కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 111 బంతుల్లో 4 సిక్సులు, 11 ఫోర్ల సహాయంతో 146 పరుగులు చేశాడు. రవీంద్రా జడేజాతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీ20ని తలపించేలా విధ్వంసం సృష్టించాడు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 57 పరుగులు చేశాడు.