టీ20 ఫార్మాట్లో భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఎలా దుమ్ములేపుతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ రప్ఫాడించేశాడు. ఒక అర్థశతకం, ఒక శతకంతో చెలరేగిపోయాడు. ఈ నేపథ్యంలోనే అతడు చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో ఏ భారత ఆటగాడు నమోదు చేయని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నట్టు తేలింది. దీంతో.. పొట్టి ఫార్మాట్లో అతని అగ్రస్థానం మరింత పదిలం అవ్వడమే కాదు, 900 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్రపుటలకెక్కాడు. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లో సెంచరీ చేయడం వల్లే.. అతడు 900 రేటింగ్ పాయింట్స్ మార్క్‌ని అందుకోగలిగాడు.
ఇంతకుముందు టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో కేవలం ఇద్దరు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్ మార్క్‌ని చేరుకోగలిగారు. ఇప్పుడు లేటెస్ట్గా సూర్యకుమార్ 900 మార్క్‌ని అందుకొని, వారి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య తర్వాత పాకిస్తాన్ ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ అల్లంత దూరాన ఉన్నాడు. 836 రేటింగ్ పాయింట్లతో అతడు రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. అయితే.. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ జాబితాలో 631 రేటింగ్ పాయింట్స్‌తో 13వ స్థానంలో ఉన్నాడు. కాగా.. ఇప్పటివరకూ 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్ రేట్‌తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.