లండన్ హోటల్‌లో వికెట్ కీపర్ తానియాకి చేదు అనుభవం.. రూమ్‌లోకి దూరి మరీ..

0
830

టీమిండియా వికెట్ కీపర్ తానియా భాటియాకు లండన్ హోటల్‌లో చేదు అనుభవం ఎదురైంది. తాను భారత మహిళ జట్టుతో ఉన్నప్పుడు.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తానియా ఉంటోన్న రూమ్‌లోకి దూరి, ఆమె బ్యాగులో ఉన్న డబ్బులు, కార్డులు, వాచీలతో పాటు జ్యువెలరీని దొంగలించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్ మాధ్యమంగా తెలిపింది. అంతేకాదు.. హోటల్ మేనేజ్‌మెంట్‌పై, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘‘లండన్‌లోని మారియట్ మైదా వాలే హోటల్ మేనేజ్‌మెంట్ నన్ను షాక్‌తో పాటు నిరాశకు గురి చేసింది. నేను నా భారతీయ మహిళా జట్టుతో ఉన్నప్పుడు.. ఎవరో నా పర్సనల్ రూమ్‌లోకి దూరి, నా బ్యాగ్‌ను దొంగలించారు. అందులో డబ్బుతో పాటు కార్డులు, వాచీలు, జ్యువెలరీ ఉన్నాయి. ఈ హోటల్ మరీ అంత అసురిక్షితమా? దీనిపై వెంటనే విచారణ జరిపి, సమస్యని పరిష్కరిస్తానని నేను ఆశిస్తున్నాను. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలాంటి భద్రత లేని హోటల్స్‌లో బస కల్పిస్తారని నేను అస్సలు ఊహించలేదు’’ అని తానియా ట్వీట్ చేసింది.

ఇందుకు హోటల్ యాజమాన్యం వెంటనే స్పందిస్తూ.. ఇలా జరిగినందుకు క్షమించాల్సిందిగా కోరింది. ఏ పేరుతో రిజర్వేషన్ చేసుకుందో, అందుకు సంబంధించిన వివరాల్ని తమకు మెయిల్ చేయాల్సిందిగా కోరింది. వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా.. ఇంగ్లండ్‌ని వారి గడ్డ మీద క్లీన్ స్వీప్ చేయడంతో, ఇంగ్లండ్ అభిమానులు కావాలనే పగతో ఈ పనికి పాల్పడి ఉంటారని భారత క్రీడాభిమానులు అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here