మారుతున్న కాలంతోపాటుగా టెక్నాలజీ కూడా కొత్త మార్పులు సంతరించుకుంటుంది… ఒకప్పుడు రాజ్యమేలిన రేడియో టీవీ రాకతో అటకెక్కింది… వీడియో ఆడియో హంగులతో ప్రేక్షకులని ఆకట్టుకున్న టీవీ లోను ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి… బ్లాక్ అండ్ వైట్ టీవీలు పోయి కలర్ టీవీలు వచ్చాయి… కేబుల్ కనెక్షన్స్ కాలంచెల్లిపోయి DTH (డైరెక్ట్ టూ హోమ్) వచ్చింది… ఇప్పుడు ఆ DTH కూడా మూలన పడనుంది…
కారణం పెరిగిన మొబైల్ వినియోగదారులు… ప్రస్తుతం దేశంలో టీవీ వినియోగదారులు 21 నుండి 22 కోట్ల కుటుంబాలు కాగా… మొబైల్ వినియోగదారులు దాదాపుగా 80 కోట్లమంది ఉన్నారు… 2026 సంవత్సరంనాటికి మొబైల్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లకి చేరనున్నదని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది… దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మొబైల్ వినియోగదారులు లక్ష్యంగా అడుగులు వేస్తుంది… మరోవైపు అనుకున్నది అనుకున్నట్టు జరిగి DTM అందుబాటులోనికి వస్తే టెలిఫోన్ ఆపరేటర్ల రెవెన్యూ 80 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నాయి…ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలపైన టెలికాం ఆపరేటర్లు నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయి…
అన్ని అవాంతరాలని దాటి DTM అందుబాటులోకి వస్తే మాత్రం ఇంటర్నెట్ లేకుండానే అన్ని టీవీ ఛానెళ్ల ప్రసారాలను వీక్షించవచ్చు…ఒక్కమాటలో చెప్పాలంటే తక్కువ ఖర్చుతో ఎలాంటి డేటా కాస్ట్ లేకుండానే ఫ్రీగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ ని కూడా వీక్షించవచ్చు… త్వరలోనే DTM ని వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్ర సమాచార ప్రసారాలశాఖ,కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖలు కసరత్తు ప్రారంభించాయి. ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే అవకాశాలపై టెలికాం ఆపరేటర్లతో ఈ టీం చర్చలు జరుపనుంది.
అసలేంటి ఈ DTM టెక్నాలజీ అంటే … ఇది బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే… మొబైల్స్‌లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్‌మిషన్ తరహాలోనే DTM టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది. దీని ప్రకారం రేడియో తరంగాలను ఫోన్ రిసీవర్ స్వీకరిస్తుంది. ప్రస్తుతం టీవీ చానళ్ల ప్రసారానికి వాడుతున్న 526-582 ఎంహెచ్‌జడ్ బాండ్‌ను డీ2ఎంలో వినియోగం కోసం కసరత్తు జరుగుతోంది.