అప్పటి వరకూ ఇంట్లో వున్నవారితో ఆడుకుంటూ హాయిగా గడిపింది. నిన్న ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో కాసేపు ఆడుకుందామని బయటకు వెళ్లింది. అంతలోనే ఓఘటన ఆచిన్నారిని కబలించింది. బయట ఆడుకుంటుండగా.. ఓ బాటిల్‌ను చూసింది. కూల్‌డ్రింక్ అనుకుని ఆబాటిల్‌ను తాగడంతో.. ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు చేరింది. క్షణాల్లోనే జరిగిన ఈ విషాదకర ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీంపూర్ గ్రామానికి చెందిన రాజేశ్, లావణ్య దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె శాన్వి ఉన్నారు. కుమార్తె శాన్వికి ఐదేళ్లు ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది. కాగా.. నిన్న ఆదివారం కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటోన్న క్రమంలో ఇంటి ఆవరణలోని ఓ బాటిల్లో ఉన్న పురుగుల మందును కూల్‌డ్రింక్ అనుకుని తాగేసింది. దీంతో.. అనంతరం ఇంటిలోకి వచ్చిన చిన్నారి శాన్వి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఓ ఆసుపత్రిలో చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి, ఇంతలోనే అనంతలోకాలకు చేరడంతో వారి రోదనలు మిన్నంటాయి. చిన్నారి శాన్వి మృతితో భీంపూర్ గ్రామంలో.. విషాదఛాయలు అలుముకున్నాయి.