టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యే ఎన్నికలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందడంపై కేంద్ర హోమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా గెలిచిన అభ్యర్థికి, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలియజేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, ఆయన గెలుపు కోసం పనిచేసిన బీజేపీ శ్రేణులకు అమిత్ షా అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఈ విజయమే తెలియజేస్తుందని అన్నారు. మార్చి 13న ఉమ్మడి మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా.. గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది.
ఈ గెలుపుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అభినందనలు తెలిపారు. ఏవీఎన్ రెడ్డితో పాటు బండి సంజయ ఆయన టీంకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ ని విస్మరించారని, ప్రజలు ప్రధాన మంత్రి మోదీజీ నేతృత్వంలోని బీజేపీని స్వీకరించారని అన్నారు. బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి తన ప్రత్యర్థి పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డిపై సుమారుగా 1150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏవీఎన్ రెడ్డి గెలుపుతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.