బావుల వద్ద ఫ్రీ కరెంట్ ఇస్తూ… ఇండ్ల వద్ద కరెంట్ ఛార్జీలు పెంచారు : బండి సంజయ్‌

0
136

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం చుట్టు తిరుగుతోంది. అయితే.. మనుగోడు ప్రజాదీవెన పేరిటి టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే.. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ.. మునుగోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని వింటే… ఆయన గొంతులో వణుకు, మాటల్లో భయం, అసహనం కన్పించాయన్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ పతనం ఖాయమైనట్లుగా ఆయన ప్రసంగంలో స్పష్టంగా కన్పించిందని, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రధానమంత్రివర్యులు, కేంద్ర హోంమంత్రి వర్యులపై అవాకులు చవాకులు పేలారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మాట్లాడే భాషేనా అది ? అని బండి సంజయ్‌ మండిపడ్డారు. ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారని బండి సంజయ్‌ విమర్శించారు. ఈడీ అంటే ఎంత భయమో ఆయన మాటల్లోనే అర్ధమైందని, అందుకే ఆ సంస్థపై నోటికొచ్చినట్లు తూలనాడారన్నారు. పచ్చి అబద్దాలు, దొంగ మాటలతో మునుగోడు ప్రజలను కేసీఆర్ మాయ చేసే ప్రయత్నం చేశారని, పదేపదే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతులను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లేయించుకోవాలని చూస్తున్నారన్నారు. కానీ రైతులకు వాస్తవాలు తెలుసునని, ఇదే విషయాన్ని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారన్నారు.

 

బావుల వద్ద ఫ్రీ కరెంట్ ఇస్తూ… ఇండ్ల వద్ద కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేంద్రాన్ని నిందించడం సిగ్గు చేటని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకపోవడానికి ముమ్మాటికీ కేసీఆరే కారణమన్నారు బండి సంజయ్‌. నేను ఎన్నోసార్లు ఆధారాలతోసహా నిరూపించానని, నాటి కేంద్ర జలశక్తి మాత్యులు ఉమాభారతి గారి సమయంలో జరిగిన అపెక్స్ సమావేశంలో 299 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిన ఆధారాలను పలుమార్లు బయటపెట్టానన్నారు. వాస్తవానికి కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా… 299 టీఎంసీలకే ఒప్పుకున్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. పక్క రాష్ట్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పేరుతో క్రిష్ణా నీటిని మళ్లించుకొని పోతుంటే… పట్టించుకోకుండా కుంభకర్ణుడలా ఫాంహౌజ్ లో పడుకున్నాడు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుందని నేను పదేపదే హెచ్చరించినా పట్టించుకోకుండా ఈ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్‌ ఆరోపించారు. మునుగోడుతో సహా రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలందరికీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో జరిగిన అన్యాయానికి ముమ్మాటికీ కేసీఆరేననే విషయం తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసు అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here