కౌంట్ డౌన్ స్టార్ట్.. కేసీఆర్‌కు బైబై చెప్పే టైం వచ్చేసింది..!

0
140

తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లో అధికారమే తమ లక్ష్యంగా చెబుతున్నారు నేతలు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ, జాతీయస్థాయి నేతలు, కేంద్ర మంత్రులు ఇలా ఏదో ఒక సందర్భంలో తెలంగాణకు వస్తూనే ఉన్నారు.. ఇప్పుడు హైదరాబాద్‌ వేదికగా జాతీయ కార్యకవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభకు సిద్ధం అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకునేలా చేస్తోంది.. అయితే, కేసీఆర్‌ నీకు బైబై చెప్పే టైం వచ్చిందని హెచ్చరించారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్ చుగ్.. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యానికి శత్రువు కుటుంబ రాజకీయాలు, కేసీఆర్‌ సర్కార్‌ జంతర్‌ మంతర్‌ సర్కార్‌ అంటూ సెటైర్లు వేశారు. రెండు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించలేదని మండిపడ్డ ఆయన.. కేసీఆర్‌ సర్కార్‌ కుంభకర్ణ నిద్రలో ఉందన్నారు.. అబద్దపు హామీలు ఇచ్చారు. హామీలు నెరవేర్చలేదు.. కానీ, అంబేద్కర్‌ని అవమానించేలా రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు.. ఈ రోజు నుండి నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.. ఇక, 529 రోజులే నీ పాలన అంటూ జోస్యం చెప్పారు తరుణ్‌ చుగ్‌.

మరోవైపు.. ‘సాలు దొర.. సెలవు దొర..’ అంటూ వెబ్ డిజిటల్ బోర్డ్ ని ప్రతి చోటా పెడతామన్నారు తరుణ్ చుగ్.. ఇక, బీజేపీ కార్యవర్గ సమావేశాలపై స్పందించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజులు హైదరాబాద్‌లో ఉంటారు.. మోడీ ప్రధాని అయ్యాక ఎప్పుడు కూడా కార్యవర్గ సమావేశాలకు ఇంత సమయం ఇవ్వలేదని తెలిపారు. కాగా, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణపై ఫోకస్ చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‎లో జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.. ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తదితర బీజేపీ కీలక నేతలుపాల్గొననున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు.. జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు జేపీ నడ్డా ఈనెల 30వ తేదీనే హైదరాబాద్ రాబోతున్నారు. రానున్నారు. మరోవైపు, జులై 3న పరేడ్ గ్రౌండ్స్‎లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారు.. భారీగా జనసమీకరణ చేయడంపై రాష్ట్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టింది. లక్షలాది మందితో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here