హైదరాబాద్‌లో ఫ్లెక్సీ వార్…! ‘సాలు మోడీ సంపకు మోడీ’

0
208

హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్‌ మొదలైంది.. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే హైదరాబాద్‌ రాబోతున్నారు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు.. జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొననున్న ఆయన.. 3వ తేదీ సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కీలక ఉపన్యాసం చేయనున్నారు.. అయితే, హైదరాబాద్‌లో రెండు కీలక మార్పులు కనిపిస్తున్నాయి.. ఓ వైపు ప్రభుత్వ పథకాలను, వాటి వల్ల కలిగే లబ్ధి తదితర అంశాలను ప్రస్తావిస్తూ హైదరాబాద్‌లో విస్తృతంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు వెలిశాయి.. పెద్ద హోర్డింగ్‌ల నుంచి బస్టాప్‌లు, మెట్రో పిల్లల్లరు ఎక్కడ చూసినా.. ఇవే దర్శనమిస్తున్నాయి.. మరోవైపు, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చగా మారాయి.. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో.. బైబై మోడీ అనే హాష్‌ ట్యాగ్‌ను రాసుకొచ్చారు.

ఆ ఫ్లెక్సీల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ వైఫల్యాలను రాసుకొచ్చారు.. రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపావు, నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టావు, హఠాత్తుగా లాక్‌డౌన్‌ అని గరీబోల్లను చంపినావు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేశావు, పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుల నడ్డి విరిచావు, బ్లాక్‌ మనీ వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవి? అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు.. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా పెద్ద క్యాంపెయనే నడిచింది.. మోడీకి వ్యతిరేకంగా రెండు హ్యాష్‌టాగ్‌లు దేశవ్యాప్తంగా గంటల వ్యవధిలో నంబర్‌ వన్‌ ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయాయి.. స్టెప్‌ డౌన్‌ మోడీ, రిజైన్‌ మోడీ, బై బై మోడీ లాంటి హ్యాష్‌టాగ్‌లు ఈ మధ్యే కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక, మోడీ ఎక్కడికి వెళ్లినా నిరసనల సెగ తాకుతూనే ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చగా మారాయి.. ఇవి టీఆర్ఎస్‌ నేతలే ఏర్పాటు చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఆ ఫ్లెక్సీలను వెంటనే కంటోన్మెంట్‌ అధికారులు, సిబ్బంది తొలగించారు. మరోవైపు, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో.. తెలంగాణ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.. 5 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here