ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. కొంగరకలాన్ లోని జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ కొంగరకలాన్ కు చేరుకుని, మొదట సమీకృత కలెక్టరేట్ ను ప్రారంభించిన అంతరం సర్వమత ప్రార్థనలు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆతర్వాత నూత కలెక్టరేట్ కు సమీపంలో సిద్దం చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.ఈనేపథ్యంలో.. 20 ఎకరాల్లో 50 వేల మందితో భారీ జనసమీకరణతో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి సబితారెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్‌పర్సన్, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్ నేతలు తదితరులు 150 మంది కూర్చునేలా సభా వేదికను సిద్ధం చేశారు. ఇక బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జన సమీకరణకు సంబంధించి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో.. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, అదనపు సీపీ సురేంద్రబాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సుమారు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. నలుగురు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 30 మంది సీఐలు, 70 మంది ఎస్‌ఐలు వీరితో ఎస్‌వోటీ ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.