మళ్ళీ ఎన్టీఆర్ వైపు… కేసీఆర్ చూపు

0
1178

‘తెలుగు’ అన్న మాటను జగద్విఖ్యాతం చేసిన ఘనత నిస్సందేహంగా మహానటుడు, మహానాయకుడు ఎన్టీ రామారావుకే దక్కుతుంది. తెలుగునాట తిరుగులేని కథానాయకునిగా వెలిగిన యన్టీఆర్, రాజకీయాల్లోనూ తనదైన బాణీ పలికించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగానూ నిలిచారు. యన్టీఆర్ స్థాపించిన ‘తెలుగుదేశం’ పార్టీ ద్వారానే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సైతం రాజకీయాల్లో వెలుగు చూశారు. తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని చెప్పుకునే కేసీఆర్ రాజకీయ కేళీలో భాగంగా మరోమారు ‘ఎన్టీఆర్ గార్డెన్’ వైపు తన చూపు సారిస్తున్నారు. గత పాతికేళ్ళుగా తెలుగువారిని అలరిస్తూ, హైదరబాద్ నగరంలో ఓ ఐకానిక్ గార్డెన్ గా ఉన్న ‘ఎన్టీఆర్ గార్డెన్’ పేరును తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మార్చబోతున్నట్టు వినిపిస్తోంది. గతంలోనూ అలా వినిపించింది. కానీ ఈ సారి మాత్రం ఖాయం అని తెలుస్తోంది. ఎన్టీఆర్ గార్డెన్ పేరును ‘అంబేద్కర్ గార్డెన్’గానూ, ఎదురుగా ఉన్న ‘లుంబినీ పార్క్’ కు ‘తెలంగాణ అమరవీరుల పార్కు’గానూ పేర్లు మార్చనున్నారని సమాచారం.

ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని తెలంగాణలో నిర్మిస్తామని గతంలోనే టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 11 ఎకరాలున్న ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల వారికీ ఎంతో గౌరవం. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌ను అభిమానించేవారున్నారు. అలాంటి ఎన్టీఆర్‌పైనే కేసీఆర్ పదే పదే దృష్టి సారించడంలోని మతలబేంటో? నిజానికి హైదరాబాద్ లో ఇంతకంటే పెద్ద పార్కులు ఉన్నాయి. వాటిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే వీలూ ఉంది. కానీ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న రీతిలో కేసీఆర్ ఆలోచించే ‘ఎన్టీఆర్ గార్డెన్’ ను ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీలోని పలువురు నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తులో పోటీ చేశాయి. ఈ సారి కూడా ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంటుందా? లేక లోపాయికారి ఒప్పందాలు ఉంటాయా? అన్న అనుమానం అందరిలోనూ ఉంది.

గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉండేది. వారంతా ఇప్పుడు టీఆర్ఎస్ చెంతనే ఉన్నారు. వారు ఈ సారి ఎన్నికల సమయంలో మళ్ళీ తెలుగుదేశంవైపు పరుగు తీస్తారేమో అని వినిపిస్తోంది. అదే జరిగితే వారి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందనీ అంటున్నారు. అందువల్ల కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఇరుకున పెట్టడానికే కేసీఆర్ ‘ఎన్టీఆర్ గార్డెన్’ వైపు దృష్టి సారించారని తెలుస్తోంది. ఎలా? ఎన్టీఆర్ గార్డెన్ కు ‘అంబేద్కర్’ పేరు నిర్ణయించినట్టయితే తప్పకుండా ఎన్టీఆర్, తెలుగుదేశం అభిమానులు వ్యతిరేకిస్తారు. రాజ్యాంగ నిర్మాత, దళితనాయకుడు అయిన అంబేద్కర్ పేరు పెడితే వ్యతిరేకిస్తున్నారు అంటూ తెలుగుదేశం వారినీ, వారు మద్దతు ఇస్తారనుకుంటున్న కాంగ్రెస్ ను జనాల్లో దోషులుగా చూపవచ్చు. తద్వారా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ప్రజల్లో వ్యతిరేక భావం కలిగించవచ్చు. లేదా పరిస్థితిని బట్టి అభిమానుల కోరిక మేరకు అన్నట్టు ‘ఎన్టీఆర్-అంబేద్కర్ గార్డెన్ ‘అని నామకరణం చేయవచ్చు. ఈ రెండు కోణాల్లో పథకం సాగనుందని తెలుస్తోంది. మరి ‘ఎన్టీఆర్ శతజయంతి’ సాగుతున్న సమయంలోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంలోనూ ఏదో రాజకీయం ఉందని వినిపిస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here