వాయిదాపడిన ఎంసెట్ (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షల రీ షెడ్యూలు విడుదలయింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది ఉన్నత విద్యా మండలి. దీంతో అప్పుడు జరగాల్సిన వివిధ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 1న ఈసెట్, వచ్చే నెల 2 నుండి 5 వ తేదీ వరకు పీజీ ఈ సెట్ జరగనుంది. ఆయా వెబ్‌సైట్‌ల నుంచి సంబంధిత అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సూచించారు. ఈనెల 18వ తేదీ నుంచి ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 20వ తేదీ వరకూ ఈపరీక్షలు జరుగుతాయి.
అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోనికి ముందే పంపిస్తారు. మొబైల్స్ , వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ జాగ్రత్తలు అభ్యర్థులంతా ఖచ్చితంగా పాటించాలి. అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్, రూట్‌ను ముందుగానే సరిచూసుకోవాలని సూచించారు. పరీక్ష సమయానికి గంట 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ లోకి విద్యార్థులను పంపిస్తారు. పరీక్ష ముగిసిన తర్వాత రఫ్ పేపర్లను కూడా ఇన్విజిలేటర్లకే అందచేయాలి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు.. మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు జరగనుంది. వర్షాల వల్ల తెలంగాణలో పలు సెంటర్లలో ఎంసెట్ పరీక్షలు ఆలస్యం అయ్యాయి. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.