Fish Seed Controversy: వైరాలో చేప, రొయ్య పిల్లల పంపిణీలో వివాదం

0
878

రాజు బహుమానం పంపిస్తే మధ్యలో మంత్రి మాయం చేసిన చందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప రొయ్య పిల్లల పంపిణీ నిర్వహిస్తోంది. అయితే కొందరు అక్రమార్కులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైపోయి నాసిరకం చేప మరియు రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసలు ఎన్ని లక్షల పిల్లలు విడుదల చేస్తున్నారో కూడా తెలియదు అంటూ ఆగ్రహించిన మత్స్యకారులు రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు చేప మరియు రొయ్య పిల్లల పంపిణీ ఉచితంగా చేపడుతోంది. ఇందులో భాగంగా వైరా రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 45 రోజుల క్రితం కూడా 14 లక్షల పైచిలుకు చేప పిల్లలను విడుదల చేయాల్సి ఉండగా కేవలం 18 వేల చేప పిల్లల మాత్రమే విడుదల చేశారు. తిరిగి ఈరోజు ఏడు లక్షల 14 వేల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామంటూ అందుకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాములు నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశారు.

అయితే మత్స్యకారులు మాత్రం తాము ఆశించిన స్థాయిలో నాణ్యమైన చేప మరియు రొయ్య పిల్లలు విడుదల చేయడం లేదంటూ మండిపడ్డారు. కాంట్రాక్టర్ తో కొందరు అధికారులు కుమ్మక్కైపోయి నాసిరకం చేప మరియు రొయ్య పిల్లల్ని విడుదల చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ప్రత్యేక అధికారిగా ఖమ్మం నుండి వచ్చిన మత్స్య శాఖ అధికారులను నిలదీయడంతో చేసేదేమి లేక ప్రారంభించిన పది నిమిషాలకే కాంట్రాక్టర్ తీసుకొచ్చిన రొయ్య పిల్లలను తిరిగి తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా తప్పుడు లెక్కలు చూపించి రొయ్య, చేప పిల్లలు పోసారని, అయితే ఆశించిన స్థాయిలో మత్స్యకారులకు లాభాలు రాకపోగా నష్టాలే మిగిలాయంటూ కొందరు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here