హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. భారీ వర్షానికి తెల్లవారుజామున తడిసిన గణేష్ విగ్రహం ఒకసారి కుప్పకూలిన ఘటన హిమాయత్ నగరలో జరిగినది. కర్మాంఘాట్ చెందిన నవజీవన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ నిమజ్జనానికి తరలిస్తుండగా, హిమాయత్ నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద విగ్రహం కూలిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించినారు.
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కూడా వాన ఆటంకంగా మారింది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డులు దెబ్బతినడంతో.. గణేష్ నిమజ్జనానికి కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్ బండ్ అంతా సోభాయమానంగా మారింది. నిమజ్జనానికి వచ్చే భక్తులతో ట్యాంక్ బండ్ కిక్కిరిసింది. గణేష్ నిమజ్జనానికి సంబంధించి ట్యాంక్ బండ్, పలు ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈనేపథ్యంలో.. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపు శనివారం ఉదయం 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇక ట్యాంక్ బండ్ గణేశ్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్ లలో పకడ్భందీగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి గణనాథుల విగ్రహాలు తరలివస్తున్నాయి. ఈనేపథ్యంలో.. ప్రధాన మార్గాల్లో హుస్సేన్‌సాగర్ వైపు భారీ సంఖ్యలో విగ్రహాలు బారులుతీరాయి.