తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, కొన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. కొన్ని గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయిన పరిస్థితి.. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది.. ఏ కొద్దిసేపు అన్నట్టుగా ఆగినా.. ముసురు, మోస్తరు వర్షాలు, భారీ వర్షం.. ఇలా ఎక్కడో ఓ ములన వర్షం పడుతూనే ఉంది.. అయితే, ఇప్పుడు వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.. భాగ్యనగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గాలులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకూలాయి.. ఇప్పుడు గాలుల తీవ్రతకు మరిన్ని చెట్లు విరిగిపడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులు సైతం అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు అధికారులు.. అంతేకాదు.. అత్యవసరం అయితేనే బయటకు రండి.. కానీ, అనవసరంగా బయటకు వచ్చి ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.. అత్యవసరం అయితేనే బయటకు రండి లేదంటే ఇంట్లోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. వర్షానికి తోడు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో.. వర్షం కురిస్తే ఎవరూ చెట్ల కిందకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని.. డీఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. కాగా, హైదరాబాద్‌లో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. లోతట్టు ప్రాంతాలు జమలయం అయ్యాయి.. ప్రధాన రోడ్లపై కూడా పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు, మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలు అందరినీ భయపెడుతున్నాయి. మరోవైపు, ఇప్పటికే ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించే పనిలో పడిపోయింది జీహెచ్‌ఎంసీ.