వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు నదులు, ప్రాజెక్టు, నిండి జన జీవనం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు, గ్రామాలకు, రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే.. భద్రాచలంలో ప్రమాదకరస్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. భద్రాచలం లో 70 అడుగుల చేరువలో గోదావరి 68 అడుగుల వరద నీరు తాకింది. కాగా.. 67 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరిలోకి 21 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. ముందస్తుగా ఊహించినట్లే 73 అడుగులు దాటే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. 36 ఏళ్ల తర్వాత భద్రాచలంలో మళ్లీ 70 అడుగులు గోదావరి నీటిమట్టం దాటుతుంది. 1986 తర్వాత ఆస్థాయిలో గోదావరికి మొదటిసారి వరద ఇంతగా పోటెత్తింది. భద్రాచలం టౌన్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసారు. ప్రస్తుతం మరో 48 గంటలు చాలా కీలకమైన సమయమని ఉన్నతాధికారులు ప్రకటించారు.
భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఇప్పటికే 2 వేల కుటుంబాలను పునరావసర కేంద్రాలకు అధికారులు తరలించారు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ లారీ యార్డ్ వద్ద నేషనల్ హైవే నెంబర్ 30 రోడ్డుపై పారుతున్న గోదావరి వరదతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంకు వెళ్లేందుకు ఉన్న ఒక్క రహదారి వరద పట్టడంతో భద్రాచలంతో బాహ్య సంబంధాలు తెగిపోయాయి. ఇప్పటికే పలు కాలనీలు నీటమునిగాయి. కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ , అశోక్ నగర్, శాంతి నగర్, రామాలయం ప్రాంతంలోని ఇళ్లల్లోకి భారీ వరద చేరింది. దీంతో నివాసాలు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రోడ్లపై వరదనీరు చేరింది. కొన్ని గ్రామాలకు 4 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. ఈనేపథ్యంలో.. రాత్రి భద్రాచలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బస చేసారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.