తెలంగాణ రాజ్ భవన్ లో బోనాల పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాజ్‌భవన్ లోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈనేథ్యంలో.. బోనాల పండుగలోభాగంగా.. గవర్నర్ తమిళసై అమ్మవారికి కోసం స్వయంగా బోనమెత్తారు. గవర్నర్ తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్‌లో పండుగలో పాల్గొన్నారు. రాజ్ భవన్‌లో నివసించే కుటుంబాలతో కలిసి గవర్నర్ తమిళసై బోనాల పండుగను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అషాడ,శ్రావణ మాసం లో తెలంగాణ లో జరిగే బోనాల పండుగకు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. నల్ల పోచమ్మ ను కొలుస్తారని పేర్కొన్నారు. అమ్మ వారి దయతో కోవిడ్ మహమ్మారి అరికట్టబడిందని ఆనందం వ్యక్తం చేసారు. ప్రజల సాధారణ జీవితానికి వచ్చారని అన్నారు. దేవాలయాలకు స్వేచ్ఛగా వెళ్తున్నారని అన్నారు. ఆటంకాలు తొలగాయని, అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు దీవనలు ఉండాలని కోరుకుంటున్నాఅని గవర్నర్ తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలని అన్నారు. కోవిడ్ బూస్టర్ డోస్ వేసుకోవాలని విజ్ఞప్తి చేసారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుందని తెలిపారు. వరదలు సంభవిస్తున్న కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచనలు చేశారు.
మరోవైపు రేపు (ఆదివారం) భాగ్యనగరంలో జరిగే బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఊరూవాడా అమ్మవారి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి, ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. నగరంలోని ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. రేపు ఉదయం (ఆదివారం) నుంచి రాత్రి వరకు భక్తులు ఆయా ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు.