దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని, గడప గడపకూ, వాడ వాడనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, క్రీడాపోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, కవిసమ్మేళనాలు, జాతీయ భావాలను రగలించే సాంస్క్రతిక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజైన 15 అగస్టు కు ముందు 7 రోజులు అనంతరం 7 రోజులు మొత్తం 15 రోజుల పాటు రాష్ట్రంలో ‘ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలు నిర్వహించాలని సిఎం కెసిఆర్ అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 75 ఏండ్ల ‘ స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం’ నిర్వహణపై శనివారం నాడు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ…‘‘ అటు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో, దేశ స్వాంతంత్ర్యం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి అర్థం కావాల్సి వున్నది. 75 ఏండ్ల కాలంలో స్వతంత్ర్య భారతం ఎన్నో ఘన విజయాలను సాధించింది. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా భారత దేశం పరిఢవిల్లుతున్నది.
భారత స్వాతంత్ర్య సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి వున్నది. నాడు వారు పొందుపరిచిన ప్రజాస్వామిక, లౌకిక వాద, సమాఖ్యవాద విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరునిమీదున్నది. భారత దేశం భిన్న సంస్క్రతులతో, విభిన్న భాషలు, మతాలు, ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలతో అత్యున్నత ప్రాపంచిక సార్వజనీన విలువలతో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనసాగిస్తున్నది.
ప్రపంచ దేశాల్లో భారతదేశానిది విలక్షణమైన సాంస్కృతిక జీవన విధానం. మారుతున్న కాలంలో పెరుగుతున్న సాంకేతికత పని వత్తిడి , ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటితరం ఆచరించిన దేశభక్తి కానీ అంతటి భావోద్వేగం కానీ నేటి యువతలో ప్రదర్శితమౌతలేవు. ఇటువంటి వాతావరణాన్ని మనం పున:సమీక్షించుకోవాల్సివున్నది. ఈ నేపథ్యంలో స్వతంత్ర్య భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అక్కెర దేశభక్తులైన తెలంగాణ బిడ్డలకున్నది. ఈ మేరకు పల్లె పట్నం వొకటై భారతావని ఘనకీర్తిని చాటాల్సి వున్నది.’’ అని సిఎం కెసిఆర్ తెలిపారు.