హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మూసాపేట్, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, అమీర్‌పేట్‌లో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల రహదారులు జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వర్షంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.
కాగా తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.