రాష్ట్రవ్యాప్తంగా.. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు.. మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే.. ఉత్తర ఒడిశా.. దానిని ఆనుకొని ఉన్న దక్షిణ ఝార్ఖండ్.. పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది.
అనంతరం అది వాయవ్యంగా పయనించి ఉత్తర ఛత్తీస్‌గఢ్ తీరంలో కేంద్రీకృతమై.. స్థిరంగా కొనసాగుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి అక్కడక్కడ చిరు జిల్లులు కురిసాయి.తెలంగాణలోని కొన్ని జిల్లాలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో.. రహదారులు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అత్యధికంగా 12.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. హైదరాబాద్‌లోనూ నిన్న భారీ వర్షం కురిసింది. ఇక రామాంతపూర్‌లో 3.1 సెంటీమీటర్ల వర్షం కురవగా.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆసిఫాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల వాగులు.. వంకలు పొంగిపొర్లాయి. కాగా.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ సమీపంలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి.