నాలుగు రోజులుగా హైదరాబాద్ మహానగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో నేడు రేపు (శని,ఆదివారా)ల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిసింది. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం శుక్రవారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నది. ఇక రానున్న 36 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఓడిశా తీరాలకు దగ్గరలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. ఇక జైసల్మేర్, ఉదయ్‌పూర్, జల్గావ్, రామగుండం మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతంపైనుంచి ఉపరితల ద్రోణి వెళ్తున్నదని తెలిపింది.
ఈసందర్బంగా.. మరో ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని పేర్కొంది.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెంటీమీటర్ల వర్షంకురిసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీచేసింది.