ఆ జంటకు మూడు నెలల క్రితమే పెళ్లి అయ్యింది. ఇద్దరే కలిసి ఉంటున్నారు. ఇటీవల ఆఫీస్‌కి వెళ్లొస్తానని చెప్పిన భర్త.. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. ఎక్కడ చూసినా, ఎంక్వైరీ చేసినా జాడ లేదు. దీంతో ఆ నవ వధువు పోలీసుల్ని ఆశ్రయించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన సోను అనే యువకుడు కొంతకాలం నుంచి హైదరాబాద్‌లోని యూసుఫ్‌గుడ బస్తీలో ఉంటున్నాడు. ఇతడు ఒక ప్రైవేట్ ఉద్యోగి. మూడు నెలల క్రితం ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న షేక్ రోషిని (24) అనే అమ్మాయితో అతనికి వివాహం అయ్యింది.
కట్ చేస్తే.. ఈనెల 5వ తేదీన ఆఫీసుకి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోను, అట్నుంచి అటే మాయమయ్యాడు. సాయంత్రం ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. భార్య రోషిని అతనికి ఫోన్ చేసింది. అయితే.. సోను ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో కంగారుపడ్డ రోషిని, తన భర్త కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆఫీస్ వాళ్లకు, అతని స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీసింది. కానీ.. ఎక్కడా సోను జాడ కనిపించలేదు. ఏం చేయాలో పాలుపోని రోషిని.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఏడాది జనవరిలో తమకు పెళ్లి అయ్యిందని, నెల రోజులుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని రోషిని తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ గొడవల కారణంగా.. తన భర్తకు రెండో పెళ్లి చేయాలని గుంటూరులో ఉంటున్న అతని తల్లిదండ్రులు చూస్తున్నారని తెలిపింది. భర్త కోసం తాను అన్ని ప్రాంతాల్లో వెతికానని, ఎక్కడా అతని జాడ తెలియరాలేదని తెలిపింది. తన అత్తమామల వద్దే తన భర్త ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.