తెలంగాణలో 8 జిల్లాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ

0
149

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి.  జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలతో పాటు వీటి చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

రాబోయే 2 రోజుల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య, వాయువ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర- వాయువ్య, ఈశాన్య జిల్లాల్లోనే అనేక పట్టణాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పాటు వరదలు వచ్చే అవకాశం ఉందని.. పంట పొలాలు నీటిలో మునిగిపోయే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ హెచ్చరించింది.

ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శనివారం రోజు నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదు అయింది. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైంసా, బాసర పట్టణాల్లోని లోతట్టు కేంద్రాలు నీటిలో మునిగాయి. దీంతో బాధితులను అధికారాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయం 9 గేట్లు ఎత్తేశారు. దీంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్, పార్వతి ప్రాజెక్ట్ గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here