Komatireddy Venkat Reddy Warns CM KCR: నల్లగొండ జిల్లా ప్రజలను, ముఖ్యంగా రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఎంపీ కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లాలోని సమస్యలపై సీఎం స్పందించకపోతే.. రక్తపాతం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని, 246 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతోన్నా.. ఎల్ఎల్‌బీసీకి సంబంధించిన డీపీఆర్‌ను ఇంతవరకూ సమర్పించలేదన్నారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ఎస్ఎల్‌బీసీని పూర్తి చేయకుండా.. కోట్లు ఖర్చు వెచ్చించి, కాళేశ్వరం నిర్మాణాన్ని పూర్తి చేశారని మండిపడ్డారు.
కృష్ణా నది నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకు 8 నుండి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఏపీ నీటి దోపిడీని అడ్డుకోకపోతే.. నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్‌బీసీ నిరుపయోగంగా మారుతుందన్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్‌ను తమ కాంగ్రెస్ పార్టీ రూపు మాపిందని.. మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రాజెక్ట్‌లపై, రైతు సమస్యలపై, కరెంట్‌పై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఉత్తర తెలంగాణ కాలువల నిర్వహణపై ఉన్న శ్రద్ధ.. దక్షిణ తెలంగాణలో ఏమాత్రం లేదని దుయ్యబట్టారు. జిల్లా రైతుల కోసం తాను దీక్ష చేపడతానని.. అది ఆమరణ దీక్షా లేక నిరవధిక దీక్షా అనేది వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి చెప్పారు.
సాగునీటి కోసం మండలి ఛైర్మన్ ఎందుకు నోరు మెదపడం లేదని కోమటిరెడ్డి ప్రశనించారు. కృష్ణా నది కేటాయంపులను వాడుకునే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదని సెటైర్లు వేశారు. తాను త్వరలోనే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకుంటానని, ఆయనతో అన్ని విషయాలూ చర్చిస్తానని అన్నారు. ఒకవేళ ఆయన నుంచి సరైన స్పందన లేకపోతే.. ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అంతేకాదు.. సీఎం స్పందిచకపోతే రక్తపాతం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు.