టీఆర్‌ఎస్ పార్టీలో చేరటం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కొండా విశ్వశ్వర్ రెడ్డి గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. ఆ పార్టీ తరఫున అదే నియోజకవర్గం నుంచి మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోయారు. అనంతరం కొన్నాళ్లు హస్తం పార్టీలోనే కొనసాగిన ఆయన చివరికి ఆ పార్టీని వదిలేశారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకే వస్తానని కొన్నాళ్లు, బీజేపీలోకి వెళతానని మరికొన్నాళ్లు చెప్పుకొచ్చారు. ఒకానొక దశలో సొంత పార్టీ పెట్టే అవకాశాలు సైతం ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఈ రకరకాల ప్రచారాలకు తెర దించుతూ కమలం పార్టీ కండువా కప్పుకోనున్నట్లు నిన్న తేల్చిచెప్పారు.
పదేళ్లుగా ఆయన రాజకీయంగా వేస్తున్న అడుగులను పరిశీలిస్తే నిలకడ లోపించినట్లు ఇట్టే తెలిసిపోతోంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన్ని లైట్ తీసుకుంటారేమోనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వల్ల బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. బీజేపీలో సాధారణ కార్యకర్తగానే ఉంటానని, పదవులు ఆశించనని ఒకవైపు చెబుతూనే మరోవైపు తాను మరోసారి చేవెళ్ల నుంచి పోటీచేస్తానని అప్పుడే ప్రకటించారు. బీజేపీకి తాను ఎలాంటి డిమాండ్లూ పెట్టలేదని అంటూనే రైతాంగం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరారు. ఈ మేరకు సంబంధిత టాస్క్‌ఫోర్స్‌లో చోటు కల్పిస్తే పనిచేస్తానని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గనక కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తే ఆయన అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. వరుసగా మూడు ఎన్నికల్లో మూడు వేర్వేరు పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థిగా పేరొందనున్నాడు. కాకపోతే ఆయన ఈ విధంగా పార్టీలు మారినంత ఈజీగా అనుచరులు, కార్యకర్తలు, ఓటర్లు మారగలరా అనేదే పెద్ద ప్రశ్న. ఒకవేళ వాళ్లు కూడా జంప్ జిలానీలుగా మారినా కొత్త పార్టీలో ఇమడగలరా అనేది మరో ప్రశ్న.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని ఒప్పుకుంటున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అదే సమయంలో దానికి భిన్నమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణలో హస్తం పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే దశలో రేవంత్‌రెడ్డికి అవకాశం ఇవ్వటం సరికాదని తప్పుపట్టారు. ఈ పరిణామాలన్నీ ఆయనలో రాజకీయ పరిపక్వత, స్పష్టత, భవితవ్యం లోపించాయనటానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.