Man of the Hole Last Of His Tribe Dies In Brazil: ఒకప్పుడు బ్రెజిల్‌లో ఓ వెలుగు వెలిగిన టనారు ఆదివాసీ తెగ.. ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. ఈ తెగకు చెందిన చివరి వ్యక్తి, ఇటీవల తుదిశ్వాస విడిచాడు. గత 26 ఏళ్లుగా ఒంటరిగా ఉంటోన్న అతను, తన గుడిసె వద్ద విగతజీవిగా కనిపించాడు. అతను సహజంగానే మృతి చెందాడని అధికారులు ధృవీకరించారు. ఆగస్టు 23వ తేదీన మృతి చెందిన ఆ వ్యక్తి పేరేంటో తెలీదు కానీ.. అతని వయసు 60 సంవత్సరాలు. గొయ్యిలు తవ్వి.. వాటిలో పడే జంతువుల్ని ఆహారంగా తీసుకుంటాడు కాబట్టి, అతనికి ‘మ్యాన్ ఆఫ్ హోల్’ అనే పేరు వచ్చింది.
అసలు ఈ తెగ మనుషులు ఏమయ్యారు? ఆ ఒక్క వ్యక్తే ఎందుకు మిగిలాడు? ఒకప్పుడు ఈ తెగకు చెందిన మనుషులు బొలీవియా బార్డర్‌లో రోండోనియా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో నివసించేవాళ్లు. 70వ దశకంలో రోండోనియా రాష్ట్రానికి చెందిన భూస్వాములు, అటవీభూముల్లో తమ పొలాలను విస్తరించాలనుకున్నారు. కానీ, ఈ టనారు ఆదివాసీ వాళ్లు ఒప్పుకోకపోవడంతో, ఆ భూస్వాములు దాడికి దిగారు. ఆ దాడిలో ఈ అరుదైన తెగకు చెందిన ఆదివాసీలు చాలామంది చనిపోయారు. ఆ తర్వాత 1995లో అక్రమ గనుల తవ్వకందారులు సైతం ఈ తెగలో మిగిలిన కొంతమందిని చంపేశారు. అలా దాడుల్లో ఈ తెగ వారు అందరూ చనిపోగా.. ఒక్క మ్యాన్ ఆఫ్ హోల్ మాత్రమే మిగిలాడు.
టనారు తెగలో అతనొక్కడే మిగిలుండటంతో.. బ్రెజిల్ ప్రభుత్వం అతను నివసించే ప్రాంతాన్ని నిషిద్ధం ప్రాంతంగా ప్రకటించింది. అతని జోలికి ఎవ్వరూ వెళ్లకుండా, అతనికి హాని తలపెట్టకూడదనే ఆ రూల్ పెట్టింది. అంతేకాదు.. అతడు సంచరించే ప్రాంతాలను సైతం బ్రెజిల్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండేవారు. చివరికి అతను ఆగస్టు 23న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తనకు చావు దగ్గర పడిందన్న విషయం తెలిసి, ఆ వ్యక్తి తన శరీరంపై స్వయంగా ఈకలు కప్పుకున్నాడు.