హిడ్మా చనిపోలేదు.. లెటర్ ద్వారా మావోయిస్టు పార్టీ క్లారిటీ

0
949

ఇటీవల ఛత్తీస్‌గఢ్ బస్తర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే! అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా మావోయిస్టు పార్టీ ఒక లెటర్ ద్వారా స్పష్టం చేసింది. మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ పేరుతో విడుదలైన ఈ లెటర్‌లో.. మావోయిస్టు నేత బెటాలియన్ కమాండర్ కామ్రేడ్ హిడ్మా చనిపోలేదని తెలిపింది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీసులు కలిసి హిడ్మాను ఎదురుకాల్పుల్లో అంతమొందించినట్టు దేశమంతా జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది.

భద్రతా బలగాలు దాడులకు దిగింది నిజమే.. కానీ అందుకు ధీటుగా మావోయిస్టులు తిరగబడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనవసరపు దాడులతో ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. దేశ రక్షణ కోసం ఉండాల్సిన భద్రత.. ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో మోహరిస్తున్నారని సెటైర్ వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విలువైన సంపద ఛత్తీస్‌గఢ్ ఆటవీ ప్రాంతలో ఉందని, ఈ విలువైన సంపదను దోచుకునే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఆదివాసీలకు చెందాల్సిన సంపదను మావోయిస్టు పార్టీ ఎప్పుడు అండగానే ఉంటుందన్నారు. మొత్తం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని పోలీసు క్యాంప్‌గా మార్చేశారని.. నిత్యం దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఏకంగా వైమానిక దాడులకు సైతం పాల్పడుతున్నారని ఆ లేఖలో వెల్లడించారు.

కాగా.. కొంతకాలం నుంచి ఛత్తీస్‌గఢ్‌ పోలీసులతో కలిపి సీఆర్పీఎఫ్‌ కోబ్రా బలగాలు, తెలంగాణ గ్రేహౌండ్స్‌ బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. నాలుగు నెలల క్రితం భద్రతా బలగాల నుంచి హిడ్మా తప్పించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఒడిశా సరిహద్దుల్లో హిడ్మా మకాం వేసినట్లు బలగాలకు సమాచారం అందడంతో.. అక్కడ కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో హిడ్మా హతమయ్యాడని బుధవారం పెద్దఎత్తున ప్రచారం జరిగింది. హిడ్మా మృతి వార్తలను పోలీసు ఉన్నతాధికారులు సైతం రాత్రి వరకు వెల్లడించలేదు. ఈ క్రమంలోనే తాజాగా లెటర్ ద్వారా హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడని మావోయిస్టు పార్టీ క్లారిటీ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here