అతనో ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. కానీ తన వ్యసనాలను మానలేకపోయాడు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. విచారణలో నిందితుడి గురించి తెలుసుకుని పోలీసులే నోళ్లు వెళ్లబెట్టారు. గుంటూరుకు చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేశ్ అలియాస్ సామ్ రిచర్డ్ నగరంలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా వృత్తిని ఎంచుకుని.. ఇళ్లలో చోరీలు చేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. 200 వరకు దొంగతనాలు చేసి పలుమార్లు జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ అదే పంథాలో చోరీలు చేయసాగాడు. తాజాగా మరో కేసులో హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీసులకు చిక్కాడు. గత నెలలో కవాడిగూడలోని ఓ ఇంట్లో దొంగతనం కేసులో వంశీకృష్ణను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 19 తులాల బంగారు నగలు, రూ.3 లక్షల నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.
వంశీకృష్ణ 2004లో ఎంబీఏలో గోల్డ్‌మెడల్ సాధించిన వంశీకృష్ణ జల్సాలకు అలవాటు పడ్డాడు. అందుకోసం సులభంగా డబ్బు సంపాదించుకోవాలని నిర్ణయించుకున్న అతడు.. దొంగతనాలే మార్గమని నిర్ణయించుకున్నాడు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు చేయడం ప్రారంభించాడు. హైదరాబాద్ నగరంతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇప్పటివరకు 200 ఇళ్లలో దొంగతనాలు చేశాడని పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. దాదాపు 67 కేసుల్లో అతను జైలుకెళ్లొచ్చాడు. అతనిపై పోలీసులు రెండుసార్లు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు.