గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపోర్లు తుండటం, చెరువులు నిండి వరద నీరు గ్రామాల్లోకి రావడంతో ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు అధికారులు. ఈ నేపథ్యంలో.. వరద ముంపు ప్రాంతాల ఆరోగ్యశాఖ అధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు సమీక్ష నిర్వహించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అంతేకాకుండా.. ముంపు ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, డాక్టర్లు ఎవరూ సెలవులు తీసుకోవద్దని వెల్లడించారు.
ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని హరీష్‌రావు తెలిపారు. వైద్యులు సెలవులు తీసుకోకుండా, తప్పనిసరిగా విధులకు హాజరయి ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు మంత్రి హరీష్‌రావు. అవసరమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరా చేయాలని, ఈ మేరకు ప్రజా ఆరోగ్యం సంచాలకులు శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డిని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు తదితర ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.