దివ్యాంగుల ఉన్నతి, సంక్షేమానికి తెలంగాణ ప్రభత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన దివ్యాంగుల జాతీయ సలహా మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. కేంద్ర సామాజిక న్యాయ సంక్షేమ, న్యాయసాధికారిత శాఖా మంత్రి వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. దివ్యాంగుల భద్రత, సంక్షేమం, ఉన్నతికి తెలంగాణలో తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ పేరుతో ప్రత్యేక విభాగం ఉందని అన్నారు. దివ్యాంగులు స్థానికంగా ఎదుర్కొనే తక్షణ సమస్యల పరిష్కారానికి కలెక్టర్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. దివ్యాంగుల ఆర్పీడబ్ల్యూడీ చట్టాన్ని 2018 మే1వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పేరుతో ప్రతి నెల దివ్యాంగులందరికీ రూ. 3,016 పింఛన్ అందిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలో 4 లక్షల 67 వేల 845 మందికి పింఛన్ అందించడానికి ప్రభుత్వం ఏటా రూ. 16 వందల 93 కోట్లు ఖర్చు చేస్తుందని సమావేశంలో వెల్లడించారు.