సెస్ ఎన్నికలు బీజేపీకి ఓ గుణపాఠమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సెస్ ఎన్నికల ఫలితాలతో బీజేపీని ప్రజలు మరోసారి తిరస్కరించారన్నారని కౌంటర్ వేశారు. అడ్డదారుల్లో గెలుపొందాలని బీజేపీ చేసిన కుటిల ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు ఓటుతో వమ్ము చేశారని ఉద్ఘాటించారు. సెస్ ఎన్నికలను సాధారణ ఎన్నికలలాగా మార్చి.. విచ్చలవిడి డబ్బులతో, ప్రలోభాలతో ప్రజలను మభ్య పెట్టాలని బీజేపీ ప్రయత్నించిందని.. కానీ అది విఫలం అయ్యిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని మరోసారి ప్రజలు తేల్చి చెప్పారన్నారు. సెస్ ఎన్నికల్లోని బీజేపీ ఓటమి.. తెలంగాణ రాష్ట్రంలోని బిజెపి పట్ల నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కారభావానికి నిదర్శనమని తెలిపారు. సెస్ ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
ఇదిలావుండగా.. సెట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తున్న కేంద్రం వద్ద కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల అధికారులు పరోక్షంగా అధికార పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లా ఎస్పీ, ఎన్నికల అధికారుల ముందే ఇరువర్గాలు గొడవకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. కొందరు బీజేపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సెస్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి, బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజు మధ్యే తీవ్ర పోటీ సాగింది.