ఈ నెల 28న ఖమ్మం లకారంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. వీరద్దరి మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది.
తెలుగు వెలుగు, సినీ వీక్షకుల ఆరాధ్యదైవం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. ‘అన్న’ ఎన్టీఆర్ నిలువెత్తురూపం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. శతజయంతి రోజున ఈనెల 28న ఖమ్మం లోని లకారం ట్యాంకుబండ్ మధ్యలో సాక్షాత్కరించబోతోంది. దీంతో పర్యాటకంగా నగరానికి సరికొత్త అలంకరణ దక్కబోతోందని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం లకారంలో 45 అడుగుల శ్రీకృష్ణావతారంలోని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఈ విగ్రహం పనులు తుదిదశకు చేరుకున్నాయి.
ఎన్టీఆర్ శతజయంతి రోజైన ఈనెల 28న విగ్రహాన్ని ఆయన మనుమడు, ప్రముఖ సినీ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా ఆవిష్కరింపజేయనున్నారు. తెలుగురాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది శతజయంత్యుత్సవాల ప్రారంభ సమయం లో రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పలువురు ఎనఆర్‌ఐలు, ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయించారు. ఈ క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌తోపాటు, ఖమ్మానికి చెందిన ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్‌తోపాటు పలువురు పారిశ్రామిక వేత్తలు, తానా సభ్యులు, ఎనఆర్‌ఐలు ఆర్థికంగా ముందుకు వచ్చారు. సుమారు రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటు కాబోతున్న ఎన్టీఆర్ విగ్రహంతో ఖమ్మం నగరానికి మరింత శోభను తెస్తుందని భావిస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు.