MLA Raja Singh Controversial Comments On Love Jihad: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మం గురించి మాట్లాడుతున్న తనను నూటికి నూరు శాతం చంపేస్తారని కుండబద్దలు కొట్టారు. ఈరోజు కాకపోయినా, రేపు తనపై బుల్లెట్ల వర్షం కురిపిస్తారని.. ఈ విషయం తనక్కూడా తెలుసని బాంబ్ పేల్చారు. ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని, అందరినీ ముస్లిములుగా మారుస్తున్నారని ఆరోపించారు. ‘లవ్ జిహాద్’ పేరుతో హిందూ యువతులను పిల్లలను కనే మిషన్లుగా తీర్చిదిద్దుతున్నారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. సోషల్ మీడియాలో హిందువులతోనే హిందువులపై వ్యతిరేకంగా పోస్టులు పెట్టిస్తున్నారన్నారు. ధర్మం కోసం ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడుతున్నారో.. వారిని చంపుతున్నారన్నారు. ధర్మం గురించి మాట్లాడుతున్న తనని కూడా ఏదో ఒకరోజు మట్టుబెట్టడం ఖాయమన్నారు. అయితే.. చావడానికి ముందు తనది ఓ కల ఉందని, అందరూ తనలాగే తయారవ్వాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు. బతకాలంటే ఆయనలా బతకాలని, చావాలంటే ఆయన కొడుకు శంభూజీలాగా చావాలని అన్నారు. ఇది కేవలం తన ఒక్కడి కల మాత్రమే కాకూడదని, ప్రతి ఒక్క హిందువు కల కావాలన్నారు. అందరూ ధర్మ రక్షణకు పాటుపడాలని, లేకపోతే హిందువులంతా రేపు మతం మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు.
రాజకీయం వేరు, ధర్మం వేరు అని చెప్పిన రాజాసింగ్.. ‘‘మీరు ఏ పార్టీలో ఉండాలనుకుంటారో అది మీ ఇష్టం, ఏ పార్టీలో ఉన్నా ధర్మాన్ని రక్షించొచ్చు, మీ ఆలోచనల్లో కొన్ని మార్పులు తెస్తే చాలు’’ అని అన్నారు. ధర్మాన్ని రక్షించాలంటే.. బీజేపీలోనే ఉండాలనే రూల్ ఏమీ లేదన్నారు. ఎందుకంటే.. టీఆర్ఎస్‌లో, కాంగ్రెస్‌లో ఉంటే పూజలు చేయరా? అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ అంటే బీజేపీ అనే ముద్ర ఎందుకు? రాముడు బీజేపీకి మాత్రమే చెందినవాడా? టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి కాదా? అంటూ నిలదీశారు. లవ్ జీహాదీని ఆపండి? మత మార్పిడిని అడ్డుకోండని రాజాసింగ్ రాజకీయ నాయకుల్ని కోరారు.