నాకు నోటీసులు రాలేదు: ఎమ్మెల్సీ కవిత

0
148

ఈడీ నుంచి నోటీసులు వచ్చాయన్న వార్తల్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని, అవన్నీ ఫేక్ వార్తలేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చున్న వ్యక్తులు.. దురుద్దేశంతోనే మీడియాని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తప్పుడు వార్తల్ని రాయడం పక్కన పెట్టేసి, నిజాల్ని చూపించడానికి సమయాన్ని వినియోగించుకోవాల్సిందిగా మీడియా సంస్థల్ని కోరారు. ‘‘టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకుల సమయాన్ని ఆదా చేసేందుకు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను’’ అంటూ కవిత ట్విటర్ మాధ్యమంగా తెలిపారు.

ఇదిలావుండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత హస్తం కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే! అప్పుడు తనపై చేసిన ఆ ఆరోపణలపై సీరియస్ అయిన కవిత కోర్టు మెట్లెక్కారు. బీజేపీ నేతలు తనపై నిరాధార ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. మరోవైపు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ 40కి పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో దాడులు చేసింది. ఒక్క హైదరాబాద్‌లోనే 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. అభినవ్‌రెడ్డి, అభిషేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఇందిరాపార్క్ వద్దనున్న శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలో సైతం ఈడీ సోదాలు చేపట్టింది.

చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు ఇంట్లో పది గంటలకు పైగా ఈడీ బృందం సోదాలు నిర్వహిస్తోంది. అతని దగ్గర పని చేసే శ్రీధర్‌ను అధికారులు అతని ఇంటికి తీసుకెళ్లారు. శ్రీధర్ ఇంట్లో దొరికిన ఆధారాలతో బుచ్చిబాబు నుంచి వివరాల్ని అధికారులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతని ఇంట్లో ఈడీ బృందానికి కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. అటు.. నెల్లూరు రాజీవీధిలోని మాగుంట శ్రీనివాసులు రెడ్డి కార్యాలయంలోనూ ఈడీ బృందం తనిఖీ చేస్తోంది. ఒక గదిలో ఎక్కువగా రికార్డులు ఉండటంతో, అదనపు అధికారులు పరిశీలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here