తెలంగాణ పీసీసీ చీఫ్‌కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. ఎంతో నమ్మకంతో.. ఏకంగా ప్రియాంక గాంధీ దగ్గరకు తీసుకెళ్లి.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించిన నేత ఇప్పుడు.. తిరుగు ప్రయాణం కావడంతో రేవంత్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.. తెలంగాణ గడ్డ నుంచి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న కేసీఆర్.. పార్టీని వీడిన నేతలకు మళ్లీ గులాబీ కండువాలు కప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు.. అదే ఇప్పుడు కేసీఆర్ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది.. ఎందుకంటే.. ఈ మధ్యే అంటే.. మే నెలలోనే టీఆర్ఎస్‌ను వీడిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు.. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం పార్టీ గూటికి చేరారు.. అయితే.. కాంగ్రెస్‌లో వారి జర్నీ మూడు నెలల ముచ్చటగానే మిరింది.. ఇవాళ ప్రగతి భవన్ కి వచ్చిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.. సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.. తన భార్యత, మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మితో కలిసి మళ్లీ టీఆర్ఎస్‌లో చేరేందుకే వచ్చారట.. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రకటన జోష్‌లో ఉన్న గులాబీ పార్టీకి.. పార్టీని వీడినవారు కూడా మళ్లీ చేరుతుండడం.. మంచిపరిణామం అంటున్నారు.
అయితే, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ఇతర పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు.. అందులో భాగంగా.. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్, తన సతీమణి భాగ్యలక్ష్మిని ఢిల్లీ తీసుకెళ్లి మే 19వ తేదీన ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పించారు.. చెన్నూర్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరుపున మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓదెలు.. అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరడం అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లాల ఓదెలుకు టీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. తనకు బదులు బాల్క సుమన్‌కు టికెట్ ఇవ్వడంతో అధిష్ఠానం నిర్ణయాన్ని ఓదెలు తీవ్రంగా వ్యతిరేకించారు.. అప్పట్లో స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లి నిరసన తెలపడం హాట్‌టాపిక్‌గా మారింది.. టీఆర్ఎస్‌లో కొనసాగితే తనకు మళ్లీ టికెట్ వచ్చే అవకాశం లేదని భావించిన ఆయన.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని టాక్ నడిచింది.. చెన్నూర్ అసెంబ్లీ టికెట్ హామీ మేరకే ఆయన కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం సాగింది.. కానీ, నాలుగు నెలలు కూడా గడవక ముందే.. మళ్లీ ఆయన కారు ఎక్కడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.. ప్రియాంక గాంధీ వరకు వెళ్లి.. పార్టీ కండువా కప్పించిన రేవంత్‌రెడ్డికి.. ఇంత తక్కువ సమయంలోనే వాళ్లు యూ టర్న్ తీసుకోవడంతో అధిష్టానం దగ్గర పరువు పోయినట్టు అయ్యింది.