ల్యాండ్ మాపియాకు పోలీసులు చెక్ పెట్టనున్నారు. భూ కబ్జాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయకులను సతాయించే ల్యాండ్ మాఫియాలకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ప్రత్యేక దృష్టి సారించారు. వారి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈవోడబ్ల్యూ)ను పటిష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీపీ ఈవోడబ్ల్యూ విభాగానికి కొంతమంది నిపుణులను జోడించారు. దర్యాప్తు అధికారులతో పాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని ల్యాండ్ మాఫియా చేసే కార్యకలాపాలను అణచివేసేందుకు కార్యాచరణను రూపొందించారు.
ఫోర్జరీ పత్రాల సృష్టితో పాటు తప్పుడు పత్రాలతో అమాయకులను బెదిరించి వారి స్థలాలలో భవనాలు నిర్మించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ తప్పుడు పనులకు సంబంధం ఉన్న ప్రతి ఒకరికీ చట్టపరంగా శిక్షలు పడేలా ఓ ప్రక్రియను రూపొందించారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలతో పాటు ల్యాండ్ మాఫియా ఆగడాలపై వస్తున్న ఫిర్యాదులను సైతం సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టింది. కొన్ని నెలల కిందట ఈవోడబ్ల్యూ అధికారులు రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కేసు దర్యాప్తు చేశారు. కొందరు నకిలీ పత్రాలతో వెయ్యి గజాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో ఈవోడబ్ల్యూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. బాధితుడికి తిరిగి స్థలం దక్కడంతో సంతోషం వ్యక్తంచేసారు. సైబరాబాద్ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.