కొద్దిసేపు ఓదార్పు తర్వాత రాష్ట్రానికి వరణుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. సోమవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం కాస్త చల్లబడింది. రాత్రి సమయంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, నగరంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే విధమైన వాతావరణం కొనసాగుతుంది.కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో రేపు బుధవారం ఉదయం వరకు 10 మిమీ నుంచి 2.40 మిమీ మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నగరంలోని చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, మలక్‌పేట్, ఎల్‌బీ నగర్, చార్మినార్, బండ్లగూడ, యూసుఫ్‌గూడ సహా కొన్ని ప్రాంతాల్లో 2.50 మిల్లీమీటర్ల నుంచి 15.50 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు రోజులలో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుండి 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండవచ్చని తెలిపింది.