అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేయొద్దు: రేవంత్ రెడ్డి

0
143

మునుగోడు ప్రజలు తనని నమ్మి వేసిన 97 వేల ఓట్లను ప్రధాని నరేంద్ర మోదీకి రూ. 22 వేల కోట్లకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఓటును రూ. 2 లక్షలకు ఆయన అమ్ముడుకున్నాడని, అలాంటి వ్యక్తికి ఓట్లు వేయొద్దని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల రోడ్లు వచ్చాయా..? డబుల్ బెడ్‌రూం ఇల్లు వచ్చిందా..? అంటూ మునుగోడు ప్రజల్ని ప్రశ్నించారు. ఎంపీటీసీ, సర్పంచులకు కూడా రూ. 40 లక్షలు వస్తున్నాయని.. అమ్ముడుపోయిన వాళ్లకు డబ్బులు వచ్చాయని కానీ, ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఒరగలేదని అన్నారు.

అమ్ముడుపోయిన నాయకుడు ఎవరైనా ఊరికొస్తే, పొరకలతో కొట్టండని పిలుపునిచ్చారు. మునుగోడులోని 97 వేల ఓట్లు కేవలం కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని చెప్పారు. మండల స్థాయి నాయకులందరూ రోజుకు రెండు గంటలు చొప్పున సమయం కేటాయిస్తే.. విజయం కాంగ్రెస్‌దేనని నమ్మకాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి ఎన్నో అవకాశాలిస్తే, ఆయన వేరే పార్టీకి అమ్ముడుపోయారని పేర్కొన్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి, లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇక కమ్యునిస్టు వాళ్లు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడాన్ని చూస్తుంటే, జాలి వేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు.

టీఆర్ఎస్‌కి మద్దతు ఎందుకని అడిగితే.. బీజేపీని ఓడించడం కోసమని కమ్యూనిస్టు వాళ్లు చెప్తున్నారని.. మరి బీజేపీని నల్గొండలో కాలు పెట్టకుండా చేసింది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. దేవరకొండలో మీ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేసుకోవాలన్నారు. మీ ఎమ్మెల్యేని కొనుక్కోవడంతో పాటు మీ పార్టీని బొంద పెట్టి, ఊరు బయట స్థూపం పెట్టిన వాడికి మద్దతు ఎలా ఇస్తారంటూ రేవంత్ రెడ్డి కమ్యూనిస్ట్ వాళ్లను నిలదీశారు. ఖమ్మంలో, కరీంనగర్‌లో ఉండే కమ్యూనిస్ట్ వాళ్లు ఏమైనా చేసుకోండని.. మునుగోడులో ఉండే కామ్రేడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here