ఎడతెరిప లేకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే వాగులు, చెరువులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల కట్టలు తెగి గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయాలు సైతం నిండిపోతుండడంతో దిగువకు గేట్లను ఎత్తుతున్నారు. అయితే.. మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ. మరో 48 గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురేసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ భారీ వర్షాలపై ఆరా తీశారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలకు సహాయక చర్యలు అందించాలని.. జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు భారీ వర్షాలపై సమీక్షించాలన్నారు సీఎం కేసీఆర్.
సీఎస్ సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి భారీ వర్షాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. అంతేకాకుండా.. ప్రజలు అవరమైతే తప్ప బయటకు రావద్దని సీఎం కేసీఆర్ సూచించారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు.. భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, కొత్తగూడెంలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.