జగదీష్ సరే.. కేటీఆర్ కూడా అలా మాట్లాడటం సరికాదు: తమ్మినేని వీరభద్రం

0
95

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రూ. 18,000 కోట్లు నిధులు ఇస్తే తాము ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించడం, అందుకు మంత్రి కేటీఆర్ వత్తాసు పలకడాన్ని.. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుపట్టారు. 18,000 కోట్లు నిధులిస్తే విత్‌డ్రా చేస్తారా? అని ప్రశ్నించారు. దేశ అభివృద్ధికి తాను నిధులు ఇస్తున్నానని మోడీ చెప్తున్నారని, మరి అందుకు మీరు విత్‌డ్రా చేసుకుంటారా? అని నిలదీశారు. నిధులిస్తే అనే మాటలు.. బీజేపీతో లూజ్‌నెస్ ఉంటుందన్న భావన కనిపిస్తోందన్నారు. వారి మాటల్లో బలహీనత కనిపిస్తోందని, దాన్ని తాము తప్పుపడుతున్నామని చెప్పారు. జగదీష్ రెడ్డి అంటే ఏదో అన్నారులే అనుకోవచ్చు.. కానీ కేటీఆర్ అలా మాట్లాడటం సరికాదన్నారు. నిధులు ఇస్తే వైఖరి మార్చేసుకుంటారా? అని అడిగారు.

ఇదే సమయంలో.. వచ్చే ఎన్నికలపై గల ప్రణాళికల గురించి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లెఫ్ట్ పార్టీలన్నీ కలిసి పని చేస్తామన్న ఆయన.. టీఆర్ఎస్‌తో పొత్తు విషయంపై మాత్రం కాస్త గందరగోళ సమాధానం ఇచ్చారు. ఆ పార్టీతో కలవాలని గానీ, కలవకూడదనే భావన గానీ తమకు లేదన్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తాము నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులపై అనేక అఘాయిత్యాలు చేశారని ఆరోపణలు చేశారు. క్షుద్రపూజలు, మనుధర్మం, చరిత్ర మార్పు వంటివి మొదలుపెట్టింది బీజేపీనే అని మండిపడ్డారు. కేసీఆర్ యజ్ఞాలు, యాగాలు చేస్తారే తప్ప.. క్షుద్రపూజలు చేయరని కౌంటరిచ్చారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్ట్‌ల కోసం ఆయన బీజేపీకి అమ్ముడుపోయారని తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here