ఐదురోజుల విరామం తర్వాత ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు మృతికి సంతాప తీర్మానం చేయనున్నారు. అనంతరం కేంద్ర విద్యుత్ , తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు ను సభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, నిజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా లీజ్ సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు.
మంత్రి హరీష్ రావు ప్రభుత్వం ఉద్యోగుల వయో పరిమితి సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.మంత్రి సబితా ఇంద్రారెడ్డి విశ్వవిద్యాలయ సాధారణ నియామక బిల్లును, తెలంగాణ సమగ్ర శిక్షణ ఆడిట్ రిపోర్ట్ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర వాహన పన్నుల సవరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 21వ వార్షిక నివేదిక, ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ వార్షిక నివేదికను , తెలంగాణ విద్యేత్ నియంత్రణ మండలి నిబంధనల సవరణ పత్రాన్ని కూడా మంత్రి సభకు సమర్పించనున్నారు.