తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా మళ్లీ పైకి కదులుతోంది.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెరగడంతో.. దేశంలో రోజువారి కేసుల సంఖ్య భారీగా వెలుగుచూస్తోంది.. ఇక, తెలంగాణలో ఐదు వందలకు చేరువగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,084 మంది శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 219 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు..
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 3,322 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులు వెలుగు చూస్తుండగా.. ఆ తర్వాత మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పెరుగుతోన్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.. ఇక, వరుసగా పెరుగుతోన్న కోవిడ్ కేసులతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.. కరోనా నిబంధనలు పాటించాలని.. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచిస్తోంది.. ఇక, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు, వృద్ధులు అనవసరంగా బయటకు రావొద్దని వైద్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.