రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. ఈ వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతుబంధు నిధులను విడుదల చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 28వ తేదీ నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్మును జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ సీఎం.. ప్రతీ పంటకు ఎలాగైతే రైతు బంధు నిధులు విడుదల చేస్తామో.. అదే తరహాలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని స్పష్టం చేశారు. దీంతో.. ఈ నెల 28 నుంచి రైతుబంధు పథకం పెట్టుబడి సాయం నిధులు.. రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.. గుంట పొలం ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అందిస్తున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలాగే రైతుల భూ విస్తీర్ణం ప్రకారం వరుస క్రమంలో తక్కువ నుంచి ఎక్కువకు లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనుంది టీఆర్ఎస్ సర్కార్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ప్రతీ ఏడాది రెండు సీజన్లకు పంట పెట్టుబడా సాయం అందిస్తుంది.. ఎకరాకు రూ.5 వేల చొప్పున.. ఏడాదికి రూ.10 వేలు పెట్టుబడి సాయం చేస్తున్న సంగతి విదితమే.. ఈసారి ఈ పథకం కింద అర్హులైన మరికొంత మంది రైతులు చేరారు.. ఇక, రైతుబంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.7,700 కోట్లు విడుదల చేసింది.. మరోవైపు, రైతు బంధుకు సంబంధించిన సొమ్మును ఎప్పటిలాగే ఈ వానాకాలం సీజన్‌లోనూ అందిస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజే తెలిపారు.. నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లడుతూ.. వ్యవసాయ శాఖ కాల్ సెంటర్‌కు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించడం, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.