Telangana: తెలివి తక్కువ విమర్శల నుంచి తెలంగాణకు విముక్తి కావాలి

0
150

Telangana: ఇవాళ తేదీ సెప్టెంబర్‌ 17. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత గల రోజు ఇది. తెలంగాణ రాష్ట్రం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను వైభవంగా జరుపుకుంటున్న శుభవేళ. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రజల ఆకాంక్షలేంటో చూద్దాం. తెలంగాణ సమాజం ముఖ్యంగా తెలివి తక్కువ విమర్శల నుంచి విముక్తి కోరుకుంటోంది. ఉదాహరణకు.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును సచివాలయానికి పెట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి అధినేతలు, పౌర సంఘాల నాయకులు, పబ్లిక్‌ స్వాగతించారు. ప్రధానంగా దళితులు గర్వంగా ఫీలవుతున్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌ వి.హనుమంతరావు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.. ఇలా దాదాపు అందరూ ఆనందం వెలిబుచ్చారు. అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ‘ఇది మంచి నిర్ణయమే’ అన్నారు. అయితే.. అదే సమయంలో ఆయన ‘మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికే సీఎం కేసీఆర్‌ అంబేడ్కర్‌ జపం చేస్తున్నారని విమర్శించారు. దీంతో ఈ కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. బండి విమర్శలు సందర్భోచితం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘విపక్షమంటే విమర్శించే పక్షమేనా? మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు నాలుగు మంచి మాటలు చెబితే పాలకులు, జనం కూడా సంతోషిస్తారు కదా’ అని విశ్లేషకులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌లో నూతన సచివాలయం మాదిరిగానే ఢిల్లీలో పార్లమెంట్‌కి కూడా కొత్త భవనం సిద్ధమవుతోంది. దానికి సైతం అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి ‘మేం కూడా దీనికి మద్దతిస్తున్నాం. బీజేపీ తెలంగాణ శాఖ తరఫున మా పార్టీ అగ్రనాయకత్వాన్ని ఈ మేరకు ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తాం’ అని కనీసం మాట వరసకైనా బండి సంజయ్ అన్నట్లయితే ఆయన ఇమేజ్ ఇంకా పెరిగేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి అంబేడ్కర్ జాతీయ నాయకుడు. రాజ్యాంగం ద్వారా దేశంలోని పాలకులందరికీ దిశానిర్దేశం చేశారు. అందువల్ల దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులకు వేదికైన పార్లమెంట్‌కు ఆయన పేరు పెట్టడం ఎంతైనా సముచితం. అంబేడ్కర్‌కు అది అత్యుత్తమ గౌరవం అవుతుందనటంలో సందేహంలేదు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు అంబేడ్కర్‌ పేరు పెడుతుందా లేదా అనేది తర్వాత సంగతి. కనీసం ‘మా అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తాం’ అనే ప్రకటనైనా బండి సంజయ్ నుంచి రాకపోవటం బాధాకరమని అంబేడ్కర్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పార్లమెంట్‌కి అంబేడ్కర్‌ పేరు కోసం సీఎం కేసీఆర్‌ వెంట నడుస్తామని ప్రజా గాయకుడు గద్దర్‌ చెప్పటం అభినందించదగిన ఆలోచన అనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసే ఒత్తిడిలో తానూ భాగస్వామిని అవుతానంటూ ఆయన ముందుకు రావటం స్వాగతించదగ్గ పరిణామమని చెబుతున్నారు. తెలివి తక్కువ విమర్శలకు మరో ఉదాహరణ.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేకపోయినా ఆయా రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండటమేనని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారనే ప్రకటనపైనా పలు విమర్శలు రావటం ఇంకో ఉదాహరణ. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొందరు తెలంగాణవాదులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సుపారి ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరుగుతోందంటూ ఆయన ఎద్దేవా చేయటం సరికాదని కేసీఆర్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్‌ పోరాటం చేసిన రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శలు చేశారంటే అర్థంచేసుకోవచ్చు. కానీ వాళ్లకు తెలంగాణ కాంగ్రెస్‌ లీడర్లు సైతం వంత పాడటం వల్ల విశ్వసనీయతను కోల్పోయారని, అందుకే తెలంగాణ జనం ఇప్పుడు వాళ్లకు ఓట్లేయట్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ‘కేసీఆర్‌ డిమాండ్‌లో న్యాయం ఉంది’ అంటూ సపోర్ట్‌ చేసుంటే ఆ పార్టీకి ప్రస్తుతం ఈ స్థాయిలో ప్రజల నుంచి తిరస్కరణ ఎదురయ్యేది కాదని పలువురు గుర్తుచేసుస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత జాతీయ రాజకీయాలను మారుస్తారా? తెలంగాణనే సరిగా పాలించలేని వ్యక్తి దేశాన్ని ఏలుతారా? ఆయనకు ‘అంతుందా’? అనే సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. వీటినీ తెలివి తక్కువ విమర్శల కిందే లెక్కించాలని చెబుతున్నారు. బీజేపీ జాతీయ పార్టీయే అయినప్పటికీ ఒకానొక దశలో దేశం మొత్తమ్మీద కేవలం రెండు ఎంపీ సీట్లకే పరిమితమై ఇప్పుడు కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారం చెలాయిస్తుండటాన్ని చరిత్రకారులు ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్‌ కూడా రెండు ఎంపీ సీట్లతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మర్చిపోకూడదని హితవు పలుకుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here