తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఆదిశేషుడి నీడలో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే.. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 67 సంవత్సరాల చరిత్రలోనే తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టించారు. విఘ్నేశ్వరుడి ప్రతిమ 50 అడుగుల ఎత్తు, 22 అడుగుల వెడల్పుతో మట్టి గణపతిని ప్రతిష్టించడం ఓ రికార్డు సృష్టించింది. ఇక ఉప మండపాల్లో 22 అడుగుల ఎత్తులో స్వామి వారి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి.. ఎడమవైపు త్రిశక్తి మహాగాయత్రి దేవిని ప్రతిష్టించారు. అంతేకాకుండా.. అన్ని విగ్రహాలను పూర్తిగా మట్టితో రూపొందించడం విశేషం. ఖైరతాబాద్ వినాయకున్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. కావున ఈ నేపథ్యంలో పోలీసులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిసేవరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. భక్తుల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
ఈనేపథ్యంలో.. ఖైరతాబాద్ పరిసరప్రాంతాల్లో.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక గణేష్ మండపం ఎదురుగా ఉన్న ప్రధాన నాలుగు రహదారులు నిఘా నీడలోకి వెళ్లాయి. దీంతో.. 9 ప్రధాన మెటల్ డిటెక్టర్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అయితే.. ఈ సారి భారీ భద్రత సెక్యూరిటి వింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది, మూడు షిఫ్ట్‌లో 360 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. దీంతో.. క్రైమ్ టీమ్స్, షీటీమ్స్, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు షాడో టీంమ్స్ రంగంలోకి దిగి, 70 అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటిని వెల్ నెస్ సెంటర్ హాస్పిటల్‌లో సెంట్రల్ జోన్ కమాండ్ కంట్రోల్ రూంకు అనుసందానం చేశారు. దీంతో.. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారిపోయాయి. వినాయకున్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూకట్టారు.