టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విబేధాలు కొన్ని ప్రాంతాల్లో తారాస్థాయికి చేరాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, కుట్రలు ఇలా చేసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాయం.. ఇక, కొన్ని సార్లు బహిరంగంగానే టార్గెట్ చేసి మాట్లాడుకోవడం చర్చగా మారుతోంది.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ నేతల మధ్య గ్యాప్‌లు కొనసాగుతున్నాయి.. సొంత పార్టీ నేతలపైనే బహిరంగ వేదికలపై బాహాటంగా మాట్లాడేస్తున్నారు నేతలు.. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వపురంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ విప్ రేగ కాంతారావు హాట్ కామెంట్లు చేశారు..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుళ్లూరు బ్రహ్మయ్యలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆయన.. రేగ కాంతారావు అనే వాడు ఉంటే వాళ్ల ఆటలు సాగవనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, నా పదేళ్ల వయసులోనే నేను కత్తులతో ఆడుకున్నానని.. స్వతహాగా నేను ఫైటర్‌ని, నాకు కత్తి తిప్పడం వచ్చు, తుపాకీ పేల్చడం కూడా వచ్చు అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు భద్రాద్రిలో చర్చగా మారాయి. అయితే, రాజకీయాలు అంటే ఇవి కావు అని హితవు పలికారు కాంతారావు.. వాళ్ల దుకాణం బందు అవుతుందనే భయంతోనే నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. మొన్న మల్లేల మడుగు, నిన్న ఆశ్వపురం ఘటనలే దీనికి నిదర్శనంగా పేర్కొన్న ఆయన.. యాభై కార్లలో వచ్చి వెళ్లేవారితో ఏమైనా ప్రయోజనం ఉందా..? అంటూ నిలదీశారు.. నన్ను గిరిజన వ్యక్తిగా ముద్ర వేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నేను అందరి వాడిని అని స్పష్టం చేశారు రేగ కాంతారావు.